google.com, pub-5976446835962781, DIRECT, f08c47fec0942fa0

Courses You can Choose After Inter/+2


         కోర్సులు

ఆసక్తే అనుగుణంగా ఆడుగేస్తే మేలు!
* ఇంటర్ తర్వాత వివిధ కోర్సులు
ఇంటర్ పూర్తి చేసిన వారు ప్రధానంగా ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులపైనే దృష్టి సారిస్తారు. వీటితోపాటు కామర్స్, లా, ఆర్ట్స్ వంటి ఇతర కోర్సులను రాష్ట్రంలోని యూనివర్సిటీలతోపాటు ఇతర రాష్ట్రాల్లోని వర్సిటీలు అందిస్తున్నాయి. వీటి గురించిన సమచారాన్ని తెలుసుకుందాం.
ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థుల ముందు రెండు మార్గాలున్నాయి. అవి ఉన్నత విద్య, ఉపాధి. ఈ రెండిట్లో ఏది అవసరమో ఎంచుకునేందుకు వివిధ రకాల పరిస్థితులు దోహదం చేస్తాయి. అంత త్వరగా ఉద్యోగం చేయాల్సిన అవసరం లేనివాళ్లు ఉన్నతవిద్యవైపు దృష్టి సారిస్తారు. ఉన్నతవిద్యకు ఎన్నిరకాల అవకాశాలు ఉన్నాయో తెలుసుకుంటే అభిరుచి మేరకు అడుగు ఎటువేయాలో అర్థమవుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అందుకు ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తున్నాం. పరిశీలించండి.
ఇంజినీరింగ్
ఎంపీసీ: గణితానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ గ్రూప్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రధానంగా ఇంజినీరింగ్ వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తీసుకునే గ్రూపు ఇది. రాష్ట్రంలో ఎంసెట్‌కు అర్హత సాధించేందుకు ఈ గ్రూపులో చేరతారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఏరోనాటిక్స్, అగ్రికల్చర్/ ఇండస్ట్రియల్ తదితర రంగాల్లో ఇంజినీరింగ్ చేసేందుకు ఎంపీసీ పునాదిగా ఉపయోగపడుతుంది. ఇక సాంకేతిక కోర్సుల నిర్వహణలో ప్రత్యేక గుర్తింపు పొందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు, ట్రిపుల్ఐటీలు, జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశానికి పరీక్ష (ఐఐటీ-జేఈఈ) రాసేందుకు ఈ గ్రూపులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది.
బిట్స్‌పిలానీలో ప్రవేశానికి జరిగే 'బిట్‌శాట్' రాసేందుకు ఎంపీసీ విద్యార్థులే అర్హులు. అంతరిక్షం, వైమానిక శాస్త్రాల్లో విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటైన 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్‌సైన్స్ అండ్ టెక్నాలజీ'లో ప్రవేశానికి 'ఐశాట్' జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లలో తొలిప్రయత్నంలోనే కనీసం 70 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన ఇంటర్ విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి నిర్వహించే వీఐటీఈఈఈ కి కూడా ఎంపీసీ విద్యార్థులే అర్హులు.
ఎంపీసీతో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత విద్యార్థికి మన రాష్ట్రంలో ప్రాథమికంగా రెండు ఆప్షన్లు ఉంటాయి. అవి..
1. ఎంసెట్
2. బి.ఎస్‌సి.
ఎంసెట్ ...
ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా విద్యార్థికి నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సులో సీటు వస్తుంది. పలు ఇంజినీరింగ్ కోర్సుల్లో విద్యార్థి ర్యాంక్, అభిరుచి తదిరాల ఆధారంగా తనకు లభించిన కోర్సులో చేరవచ్చు.
బీఎస్సీ
బి.ఎస్‌సి.లో వివిధ రకాల కాంబినేషన్లతో కోర్సులున్నాయి.
అవి..: మ్యాథ్స్-ఫిజిక్స్-కెమిస్ట్రీ, మ్యాథ్స్-ఫిజిక్స్-ఎలక్ట్రానిక్స్, మ్యాథ్స్-ఫిజిక్స్-కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్-స్టాటిస్టిక్స్-కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్-కెమిస్ట్రీ-ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, మ్యాథ్స్-ఫిజిక్స్-జియాలజీ, మ్యాథ్స్-ఎలక్ట్రానిక్స్-జియాలజీ, కెమికల్ టెక్నాలజీ, మర్చంట్ నేవీ, డైరీ టెక్నాలజీ, సుగర్ టెక్నాలజీ, జియాలజీ-ఫిజిక్స్-కెమిస్ట్రీ, బీఎస్సీ ఫోరెన్సిక్ తదితరాలు ప్రధానమైనవి.
డాక్టర్ కావాలనుకుంటున్నారా?
బీపీసీ : డాక్టర్‌గా, వెటర్నరీ డాక్టర్‌గా, వైద్య సంబంధిత ఇతర వృత్తుల్లో, ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేవారు బీపీసీపై మొగ్గు చూపుతారు. ఓపిగ్గా చదవడం, చక్కగా బొమ్మలు వేయడం ఈ గ్రూప్ విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలు. వైద్యులు ఎక్కువగా తమ పిల్లలను వైద్యులుగా తీర్చిదిద్దాలని ఆశిస్తారు.
బయలాజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఇంటర్మీడియట్ చేస్తే ఉండే ఉన్నత విద్యావకాశాలు...
బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మసీ, జెనెటిక్స్, అగ్రికల్చర్ ఆక్వాకల్చర్, ఆస్ట్రానమీ, బయోఇన్ఫర్మాటిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫుడ్‌టెక్నాలజీ అండ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్ రేంజర్, జియాలజీ, హార్టికల్చర్, హోంసైన్స్, మాలిక్యులార్ బయాలజీ, ఓషనోగ్రఫీ, ప్లాంట్‌పాథాలజీ తదితర రంగాల్లో అవకాశాలుంటాయి. నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్ ఈ శతాబ్దపు పరిశోధనా రంగాలుగా పేర్కొనవచ్చు. రానున్న యుగం బయాలజీదేనని చెప్పవచ్చు. బయాలజీ విద్యార్థుల ముందున్న మరిన్ని అవకాశాలను పరిశీలిస్తే..
వైద్య విభాగంలో AIIMS, JIPMER, MGIMS, BHU, AFMC, CMC లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాలయాల్లో ప్రవేశం కోసం బయాలజీ విద్యార్థులు ఆయా సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలు రాయాలి. ఇక మన రాష్ట్రంలో ఎంసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ద్వారా రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ఎక్కడైనా ప్రవేశం పొందవచ్చు.
ఎంసెట్ ద్వారా లభించే మెడికల్, అగ్రికల్చరల్ కోర్సులు
1) ఎం.బి.బి.ఎస్.
2) బి.డి.ఎస్.
3) బి.ఫార్మా.
4) బి.ఎ.ఎం.ఎస్.
5) బి.హెచ్.ఎం.ఎస్.
6) బి.ఎస్.ఎం.ఎస్. (సిద్ధ)
7) బి.ఎస్‌సి. (అగ్రికల్చర్)
8) బి.ఎస్‌సి. (ఫిషరీస్).
9) బి.ఎస్‌సి. (ఫారెస్ట్రీ).
10). బి.వి.ఎస్‌సి (వెటర్నరీ).
మెడిసిన్‌తో ఉన్నత విద్యావకాశాలు
మెడిసిన్ చేసిన తరువాత ఉన్నత విద్యలో రాణించాలంటే ఎం.డి., ఎం.ఎస్., డి.ఎం., పీజీ ఇన్ ఫోరెన్సిక్ మెడిసిన్, ఏరోస్పేస్ మెడిసిన్, ఏవియేషన్ మెడిసిన్, సైకియాట్రి, డెర్మటాలజీ, పీడియాట్రిక్స్ తదితర కోర్సులు ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ అవకాశాలను దృష్టిలో పెట్టుకొని బయాలజీలో చేరే విషయాన్ని ఆలోచించాలి. మొత్తంమీద వెంటనే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేని విద్యార్థులు ఎంపీసీ, బీపీసీలను ఎంచుకోవచ్చు.
కామర్స్ కోర్సులు
ఎంఈసీ, సీఈసీ: భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. స్థూల జాతీయోత్పత్తిలో సేవారంగం ప్రధానపాత్ర పోషిస్తోంది. దీంతో కామర్స్ గ్రాడ్యుయేట్లకు రోజురోజుకీ అవకాశాలు పెరుగుతునాన్నాయి. సేవారంగం వైపు చూసేవారు, సైన్స్, ఆర్ట్స్ గ్రూపులపై పెద్దగా ఆసక్తి లేనివారు లెక్కలు, గణాంకాలు, కామర్స్ సబ్జెక్టులతో కూడిన ఎంఈసీ, కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్ సబ్జెక్టులున్న ఎంఈసీ, సీఈసీల్లో చేరవచ్చు. చార్టెర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రెటరీలు, కమర్షియల్ లాయర్లు, బ్యాంకు మేనేజర్, ఛార్టెర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ట్యాక్స్ ఆడిటర్ లాంటి వృత్తుల్లో స్థిరపడాలనుకునే వారు ఇన్స్యూరెన్స్ సంస్థల్లో, స్టాక్‌మార్కెట్లలో ఉద్యోగాలు పొందాలనుకునే వారు ఈ గ్రూపులను ఎంచుకోవచ్చు. మేథమేటిక్స్, కామర్స్ సబ్జెక్టులు రెండూ అధ్యయనం చేయడం మరింత మెరుగైన ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తుంది. సీఏ, ఐసీడబ్ల్యూఏ, బిజినెస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ రంగాల్లో ఉన్నత విద్యకూ అవకాశం ఉంది. ఈ రంగాలపై గత అయిదారేళ్లుగా ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఇంటర్లో కామర్స్ ఒక సబ్జెక్టుగా గ్రూపులు ఎంచుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది..............
సాంప్రదాయిక డిగ్రీ కోసం..
ఆర్ట్స్ గ్రూపులు: పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకునేవారు గతంలో ఆర్ట్స్ గ్రూపుల్లో చేరేవాళ్లు. ప్రస్తుతం ఈ గ్రూపుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవడంతో ఇవి అంతరించిపోతున్నాయి. ఇటీవలికాలంలో ఇంజినీరింగ్ విద్యార్థుల సంఖ్య పెరిగి, ఉపాధి అవకాశాలు తగ్గడంతో మళ్లీ ఈ గ్రూపులకు డిమాండ్ పెరుగుతోంది. యూపీఎస్‌సీ నిర్వహించే కొన్ని పోటీపరీక్షల్లో మంచి స్కోర్లు సాధించేందుకు డిగ్రీస్థాయిలో ఈ గ్రూపుల్లో చేరతారు. డిగ్రీలో సోషల్ సైన్సెస్ (సోషల్, కల్చరల్, పొలిటికల్, ఎకనమిక్స్ సబ్జెక్టుల్లో) చేరేందుకు కూడా ఈ గ్రూపులు అనుకూలం. విదేశీభాషల్లో పరిజ్ఞానం సాధించడం ద్వారా అనేక అవకాశాలను అందుకోవచ్చు. కొరియన్, చైనీస్, స్పానిష్ లాంటి భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారికి అనువాదకులుగా ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది.
విభిన్నమైన, ఆధునిక కోర్సులు
సముద్ర పరిశోధనలు: సముద్రాల అధ్యయనమే ఓషనోగ్రఫీ. ఐఐటీ మద్రాస్, ఐఐటీ బొంబాయి, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అన్నామలై యూనివర్సిటీ లాంటివి ఈ కోర్సులు అందిస్తున్నాయి.
జెమ్మాలజీ: రత్నాల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే జెమ్మాలజీ. జెమ్మాలజీలో పలు సంస్థలు డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి.
ఫ్యాషన్ టెక్నాలజీ: ఆధునిక ప్రపంచంలో యువతను బాగా ఆకర్షిస్తున్న రంగమిది. ఫ్యాషన్ కెరీర్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లాంటి పలు సంస్థలు ఈ రంగంలో ఎన్నో కోర్సులను రూపొందించాయి.
వినోద రంగం: సినిమాలు, టీవీల్లో వినోద కార్యక్రమాలకోసం అవసరమైన నిపుణులను అందించేందుకు పలు యూనివర్సిటీలు ఎడిటింగ్, డబ్బింగ్, థియేటర్ ఆర్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్ తదితర అంశాల్లో కోర్సులు అందిస్తున్నాయి.
విపత్తు నిర్వహణ: ప్రకృతి వైపరీత్యాలకు ముందు, తర్వాత చర్యలకోసం పలువురు నిపుణుల అవసరం ఎంతో ఉంటుంది. నిపుణులను తయారు చేసేందుకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పేరుతో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
టూరిజం అండ్ హోటల్ మేనేజ్‌మెంట్: ఈ రంగంలో పెరుగుతున్న
 అవకాశాలకు అనుగుణంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్‌మెంట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ తదితర సంస్థలు కోర్సులు అందిస్తున్నాయి.
లా కోర్సులు: సమాజంలో రోజురోజుకూ న్యాయవ్యవస్థకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని పలు విద్యాసంస్థలు ప్రత్యేకంగా లా కోర్సులను అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు లా యూనివర్సిటీలు కలిసి కామన్‌లా అడ్మిషన్ టెస్ట్ పేరుతో ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నాయి. ఏపీలా యూనివర్సిటీ, ఉస్మానియా లా కాలేజ్, నేషనల్ లా యూనివర్సిటీ, నల్సార్ లా యూనివర్సిటీ, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీ, నిర్మా యూనివర్సిటీ, కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీ లాంటివి ప్రత్యేకంగా లా కోర్సులు అందిస్తున్నాయి. ఇందులో అయిదేళ్ల కోర్సులన్నింటికీ అర్హత ఇంటర్మీడియటే.
ఇంటిగ్రేటెడ్ కోర్సులు: అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకూ ఇంటర్మీడియటే అర్హత. రాష్ట్రంలోని సాంప్రదాయిక యూనివర్సిటీలన్నీ ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తున్నాయి.
దూరవిద్య: రెగ్యులర్‌గా డిగ్రీలు చేయలేనివారు ఇంటర్ తర్వాత దూరవిద్య ద్వారా డిగ్రీ చేసేందుకు అవకాశం ఉంది. దాదాపు అన్ని యూనివర్సిటీలూ దూరవిద్యను అందిస్తున్నాయి.

Source: Internet
Theme images by luoman. Powered by Blogger.